Sunday, 26 October 2014


నేను కవిని కాదు రచయితను కాదు
నేను చిత్రకారుడిని కాదు చరిత్రకారుడిని కాదు
నాకు స్పందించే హృదయమూ లేదు
ప్రకృతిని ఆస్వాదించే సమయమూ లేదు

నాకీ ప్రపంచాన్ని ఎదిరించే ధైర్యం కానీ పోరాడే గుణం కానీ లేదు
కాలం తో పాటు సాగి పోతాను
నొప్పి కలిగితే బాధ పడతాను మంచి జరిగితే పొంగి పోతాను
నాకు అన్యాయం జరుగుతున్నా నేనింతే

మనస్సుకు తోచింది రాయటానికి కవినో రచయితనో అవ్వాలా
గీతలు గియ్యటానికి చిత్రకారుడినే అవ్వాలా
కూనిరాగం తీయటానికి గాయకుడినే అవ్వాలా
లయబద్దంగా కదలటానికి నాట్యకారుడినే అవ్వాలా

నాఈ ఆకలిపోరాటంలో
నన్ను పిరికిపంద అని ఎగతాళి చేసినా
నిన్ను చూస్తుంటే జాలేస్తుందని గేలి చేసినా
పెదవి కదపక సాగిపొయ్యే సగటు మనిషిని

అయితేనేం
నా హృదయం నవనీతమ్
నా మనస్సు సున్నితమ్
నా మాట మృదు మధురం

సంస్కారం సహజత్వం నా ఆభరణం శీలం నా సర్వస్వం
సంస్కృతి అంటే ప్రాణం సంప్రదాయం అంటే అభిమానం
నీతి నిజాయితీ నిర్మలత్వం నిరాడంబరత్వం
ఇవే నా సిరి సంపదలు

No comments:

Post a Comment